మసూద్ కమిటీ ఏమి చెప్పిందంటే…
పోలవరంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన మసూద్ కమిటీ నివేదక వచ్చింది. సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో ఉండటంతో ఆయన అనుమతితో ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 20 పేజీలో నివేదికలో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. ముఖ్యంగా పోలవరం కాంక్రీట్ పనుల్లో నవయుగ కంపెనీ రంగంలోకి వచ్చాక పోలవరం పనులు వేగవంతమయ్యాయని, రోజుకు 4,800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతున్నాయని మసూద్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా నిర్దేశించిన లక్ష్యంలోనే పోలవరం పనులు పూర్తవుతాయని నివేదికలో పేర్కొన్నారు.
మరోవైపు కాంక్రీట్ పనుల్లో నాణ్యత ఉందని మసూద్ కమిటీ స్పష్టం చేసింది. పోలవరం పరిహారం, పునరావాసంపై ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలవరం ముంపుగ్రామమైన మేడిపాక గ్రామంలో కమిటీ సభ్యులు పర్యటించారు. దీంతో పాటు మరికొన్ని గ్రామాల్లో కూడా పర్యటించి, నిర్వాసితులతో మాట్లాడారు. ప్రభుత్వం అందించిన పునరావాసంపై బాధితులు సంత ప్తి వ్యక్తం చేశారని నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా బాధితుల స్టేట్మెంట్లను కూడా కమిటీ రికార్డు చేసింది. ఈ కమిటీలో చీఫ్ ఇంజనీర్లతో పాటు, కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ కమిటీ దాదాపుగా వారం రోజులు పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించింది. ఈ నివేదికను మూడు రోజుల క్రితం కమిటీ కేంద్రానికి అందజేసింది. ప్రధాని, కేంద్ర హోం శాఖ, నాబార్డ్, ఏపీ ప్రభుత్వానికి నివేదికను పంపారు. ఏపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణ బాధ్యతలను నీతి ఆయోగ్ సూచలనల మేరకు నిర్మిస్తోంది.













