కర్నూలు జడ్పీ చైర్మన్ మల్కిరెడ్డి రాజీనామా
కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జిల్లా కలెక్టరు కోటేశ్వరరావుకు అందించారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు సుబ్బారెడ్డి తెలిపారు. జడ్పీ చైర్మన్గా వెంకట సుబ్బారెడ్డి ఈ ఏడాది సెప్టెంబరు 25న బాధ్యతలు చేపట్టారు. గత నెలలో జడ్సీ స్థాయీ సంఘ ఎన్నికలు నిర్వహించారు. ఈ నెలలో సర్వసభ్య సమావేశానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కొత్త సమస్య మొదలైంది. జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని వైసీపీకి చెందిన కొందరు నేతలు ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడిన తర్వాత రాజీనామా చేస్తానని సుబ్బారెడ్డి ప్రకటించడంతో పార్టీలో చర్చనీయాంశమైంది. సీఎం ఆదేశిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకుంటే కొనసాగుతానని స్పష్టం చేశారు.
వెంకట సుబ్బారెడ్డి రాజీనామా చేయడంతో ఆ పదవి ఎర్రబోతుల పాపిరెడ్డికి వచ్చే అవకాశం ఉంది. ఎర్రబోతుల వెంకటరెడ్డికి చైర్మన్ పదవి ఇస్తానని గతంలో సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కరోనా కారణంగా వెంకటరెడ్డి మృతి చెందారు. దీంతో ఆయన కుమారుడు పాపిరెడ్డి ఉప ఎన్నికలో గెలిచారు. పాపిరెడ్డి కోసం మల్కిరెడ్డిని పార్టీ అధిష్ఠానం రాజీనామా చేయించనట్లు తెలుస్తోంది.













