రాజంపేట టికెట్ పై క్షత్రియుల తీవ్ర నిరాశ..
ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో సీట్లు దక్కని క్యాండిడేట్లు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని..పార్టీ కోసం నిరంతరం పనిచేసిన క్షత్రియులకు ఈ సారి కూడా టీడీపీ అధిష్టానం మొండిచేయి చూపించింది. 2019 ఎన్నికల సమయంలో రాజంపేట సీట్ రాజులకు కేటాయిస్తామని చెబుతూ వచ్చిన టీడీపీ చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించింది. కనీసం ఈ ఎన్నికల్లో అయినా రాజంపేట నుంచి టికెట్ వస్తుందని వారు ఆశించారు. పైగా ఈసారి కూటమి పొత్తులలో భాగంగా రాజంపేట టికెట్ జనసేనకు కేటాయిస్తారు అని .. జనసేన యల్లటూరు శ్రీనివాసరాజు కే టికెట్ వస్తుంది అని జోరుగా ప్రచారం జరిగింది. అధిష్టానం పైన ఉన్న ధీమాతో ఆయన ప్రచారం మొదలు పెట్టారు. రాజంపేట సీట్ జనసేన కు ఇచ్చినా.. టీడీపీ కు దక్కినా పర్లేదు అని అందరూ భావించారు. జనసేన శ్రీనివాస్ రాజు, టీడీపీ జగన్మోహన్ రాజు ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కుతుందన్న గట్టి నమ్మకం రాజులలో ఉండేది. అయితే వారి ఆశలపై నీరు పోస్తూ రాయచోటికి చెందిన టీడీపీ నేత సుగవాసి సుబ్రమణ్యంకు రాజంపేట టికెట్ ఇచ్చారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తమ సామాజిక వర్గానికి సీట్ రాకపోవడం తో రాజులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలలో వీరు ఎటువంటి వైఖరి అవలంబిస్తారు అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది.













