Kotamreddy: జగన్ పై కోటంరెడ్డి ఇండైరెక్ట్ కౌంటర్..

నెల్లూరు (Nellore) రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ నేత, ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) తాజా వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది. శనివారం ఉదయం ఆయన మీడియా ముందు మాట్లాడారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను చంపేస్తే డబ్బే డబ్బు అనే రౌడీషీటర్ల వ్యాఖ్యలు పెద్ద సంచలనం రేపాయి. ఈ వీడియో విషయమై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, కోటం రెడ్డి దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వీడియో రెండు వారాల కిందటే పోలీసుల దృష్టికి వెళ్లిందని, కానీ తనకు చెప్పలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాను అప్రమత్తంగా ఉండేలా చేయకపోవడంపై ప్రశ్నించారు. ఈ ప్రణాళిక వెనుక వైసీపీ (YCP) నాయకుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. తాను వైసీపీ నేతలను బహిరంగంగా ఎదిరించటమే ఈ కుట్రకు కారణమని తెలిపారు. తాను ఎప్పుడూ ఎవరికీ ద్రోహం చేయలేదని, రాజకీయ విభేదాలున్నా, తన వ్యక్తిగత స్వార్థం కోసం ఎవరినీ వేధించలేదని స్పష్టం చేశారు.
తన కుటుంబానికి ఈ రకమైన ధమ్కీలు కొత్తవేమీ కావని, రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని గుర్తుచేశారు. ప్రజల కోసం ఏది అవసరమైతే అది చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు. వ్యక్తిగత ఆస్తులు, సంపాదన తనకు ప్రాధాన్యం కాదని, తాను అక్రమంగా ఏమి సంపాదించలేదు అని పేర్కొన్నారు.
ఇదిలావుండగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) పై కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. ఆస్తుల కోసం సొంత వారిని తరిమి కొట్టడం , అవి అడ్డు తొలగించే తత్వం తమ కుటుంబంలో ఎప్పుడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం సొంత మనుషులనే బలిపశువులుగా మార్చే ధోరణి తనలో లేదని స్పష్టం చేశారు.
నెల్లూరులో వెలుగులోకి వచ్చిన ఈ కుట్ర వెనుక నిజాలు బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. హత్య ప్రణాళికలో పాల్గొన్న నలుగురు రౌడీషీటర్లు ఇప్పటికే పోలీసుల అదుపులోకి వచ్చిన విషయం తెలిసిందే. వారిని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ కుట్ర వెనుక వైసీపీకి చెందిన ఒక కీలక మాజీ మంత్రి పేరు వినిపిస్తోందని, ఆ కోణంలోనూ విచారణ కొనసాగుతోందని సమాచారం.విషయం తీవ్రతను గమనించిన ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్ర హోం మంత్రి అనిత (Home Minister Anitha) నేరుగా కోటంరెడ్డితో మాట్లాడి భరోసా ఇచ్చారు. ప్రజల కోసం రాజకీయాల్లో ఉన్నానని, ప్రజల మద్దతే తన బలం అని కోటం రెడ్డి పునరుద్ఘాటించారు.