ఏపీలో ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందేకు కైనటిక్ గ్రీన్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఫిరోదియా మోత్వాని, కార్యనిర్వహక సంచాలకుడు రితేష్ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్‌తో భేటీ అయ్యారు. కైనటిక్ గ్రీన్ కంపెనీ ఎలక్ట్రిక్ ఆటోలు, బగ్గీలు, గోల్ఫ్ వాహనాలు, చెత్త సేకరణ వాహనాలను ఇప్పటికే తయారు చేస్తోంది. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను పెద్దఎత్తున వినియోగించనున్నామని, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో విశాఖ, అమరావతి, తిరుపతిలో ఎలక్ట్రిక్ వాహనాలను భారీగా వినియోగంలోకి తేనున్నామని గ్రీన్ కంపెనీ ప్రతినిధులకు చెప్పారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నామని, వీటికోసం చెత్తను సేకరించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ఇవ్వనున్నామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చేందుకు, తక్కువ ఖర్చుతో ఈ వాహనాలను ప్రజలు కూడా వినియోగించేలా చూసేందుకు గాను ప్రత్యేకంగా విద్యుత్ వాహన చలనశక్తి విధానా (ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ పాలసీన్ని) తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.
రాయలసీమ ప్రాంతం ఎలక్ట్రానిక్ హబ్‌గా మారుతోందని వివరించారు. రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు పూర్తి సహకారమందిస్తామని వారికి హామీ ఇచ్చారు. స్పందించిన కంపెనీ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని, ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థను ఏర్పాటు చేస్తామని, త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదికతో వస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని అభినందనలు తెలిపారు.













