బాబు వూహ్యం పలించేనా, ముద్రగడ ముద్రనాపగలిగేరా?
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పీడ్ కు చంద్రబాబు బ్రేకులు వేశారా? కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? కాపులకు రిజర్వేషన్లు కల్పించడమే తమ బాధ్యతని చంద్రబాబు చెప్పడాన్ని చూస్తే ముద్రగడ ముద్ర వచ్చే ఎన్నికల్లో లేకుండా చేయడమే టీడీపీ లక్ష్యంగా కన్పిస్తోంది. నిన్న విజయవాడలో జరిగిన కాపు నేతల సమావేశంతో ఈవిషయం స్పష్టమైంది. కాపు రిజర్వేషన్లకు ఏ ప్రభుత్వం కృషి చేయని విధంగా టీడీపీ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. మంజునాధ కమిషన్ రిపోర్ట్ త్వరలో వస్తుందని, అది రాగానే రిజ్వరేషన్లను అమలు చేస్తామని చెప్పారు. ఈ సమావేశం వెనక పెద్ద తతంగమే నడిచిందంటున్నారు. ఈ సమావేశానికి పెద్దగా హోం మంత్రి చినరాజప్ప వ్యవహరించినా… తెరవెనక మంత్రాగమంతా చంద్రబాబే నడిపారంటున్నారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఆఘమేఘాల మీద ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
ముద్రగడ ముద్ర లేకుండా చేయాలనుకున్న……బాబు…
టీడీపీ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపు నేతలు హాజరయ్యారు. దాదాపు రెండు వేల మంది కాపు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ముద్రగడ తన స్పీడ్ ను పెంచారు. ఇంకా నానుస్తూ పోతే 2019 ఎన్నికల్లో కాపుల ఉద్యమ సెగ టీడీపీ తగులుతుందని టీడీపీ అధినేత భావించారు. అందుకోసమే ముద్రగడను ఏకాకిని చేసి కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలనుకున్నారు చంద్రబాబు. ముద్రగడను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వానికి సహకరిస్తే అంతా మంచే జరుగుతుందని చంద్రబాబు కాపునేతలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. సున్నితమైన అంశం కావడంతో చంద్రబాబు దీన్ని జాగ్రత్తగా డీల్ చేశారు. ఒకవైపు ముద్రగడ పాదయాత్ర చేసేందుకు ఇంటినుంచి బయటకు రానివ్వకుండానే తాను కాపునేతలతో సమావేశమై తన ప్రభుత్వం కాపు సామాజిక వర్గం సమస్యల పట్ల ఎంత సీరియస్ గా ఉందో తెలియజెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ముద్రగడను ఒంటరి చేయాలన్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయా? కాపు సామాజిక వర్గం టీడీపీ వెంట నడుస్తుందా? వేచి చూడాల్సిందే.













