పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించాలి
ఆంధప్రదేశ్‌లో వైకాపా అధికారం చేపట్టిన 20 నెలల్లో వలసలు పెరిగాయని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నవరత్నాల పేరుతో ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందన్నారు. వైకాపా ప్రభుత్వ పెద్దలంతా పేదల వ్యతిరేకులని ఆయన ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు అర్ధాకలితో అలమటిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధప్రదేశ్ అని అన్నారు. జగన్ పాలనలో పింఛన్ తీసుకునే లబ్ధిదారులు సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని విమర్శించారు. దాదాపు 20 లక్షలకు పైగా రేషన్‌కార్డులు తొలగించారని ఆరోపించారు. నిత్యవసరాలకు ప్రభుత్వం సబ్బిడీలు తగ్గించటం వల్ల కందిపప్పు, పంచదార తదితర ధరలు పెరిగి ప్రజలపై రూ.750 కోట్ల అదనపు భారం పడిందన్నారు. ప్రజలు ఈ వాస్తవాలను గ్రహించాలని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచే అభ్యర్థుల్ని గెలిపించాలని ఆయన కోరారు.













