చంద్రబాబు విడుదలయ్యే వరకు .. కొనసాగిస్తా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమని ప్రజలకు తెలియజేప్పేందుకే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వరుసగా రెండో రోజు కాల్వ దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విడుదలయ్యేంత వరకు వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా 2 లక్షల మందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు వచ్చేలా చంద్రబాబు కృషి చేశారని అన్నారు. అలాంటి వ్యక్తిని దురద్దేశ పూర్వకంగా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న అధికారులెవ్వరూ సీఎం జగన్‌కి సహకరించవద్దని కోరారు.













