అన్ని స్థానాల్లో పోటీచేస్తాం
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లోనూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. కొన్ని స్థానాల్లోనే పార్టీ పోటీ చేస్తుందని తానెప్పుడూ చెప్పలేదన్నారు. బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకెళ్తామని తెలిపారు. 13 జిల్లాల నుంచి వచ్చిన పార్టీ ముఖ్య కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లోనే 70-80 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలనుకున్నా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఏకు సహకరించాం. కులాలా ఐక్యత మా తొలి సిద్ధాతం. జనసేనలోని ప్రతి కార్యకర్తకు రెండు ఎన్నికల్లో క్రియాశీలంగా పని చేసిన అనుభవం ఉంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు సాధనకు ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజా సమస్యలు తెలియపరిచేలా ప్రజల మధ్యలోకి వెళ్తాను. ఈ నెల 11లోగా పర్యటనల వివరాలు వెల్లడిస్తాను. తెలంగాణలో పార్టీ క్యాడర్ నిర్మాణంపై దృష్టి సారించాం. ఆగస్టు రెండోవారంలో తెలంగాణ పోటీకి సంబంధించిన ప్రాథమిక ప్రణాళికను వెల్లడిస్తాం అని పేర్కొన్నారు.













