వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి
– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకు వికేంద్రీకరణ సరైన మార్గమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు రామన్నపేట ఒకటో లైన్ లోని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యాలయంలో వికేంద్రీకరణ తోనే రాష్ట్ర ప్రగతి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని విమర్శించారు. అమరావతి రాజధాని ప్రకటన ముందు ఆ ప్రాంత రైతుల నుంచి 14 వేల మంది భూములు కొనడం పై నేడు చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఎనిమిది వందల మంది తెల్లకార్డు ఉన్నవారు భూములు కొన్నారు అంటే ఏ స్థాయిలో కుంభకోణం జరిగిందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా నాడు చంద్రబాబు అమరావతిలో రాజధాని నిర్మాణం నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అమరావతిలో ఏం అభివృద్ధి జరిగిందని ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. అమరావతి చంద్రబాబు, ఆయన బినామీల వ్యవహారంగా మారిపోయింది అని తెలిపారు. సుదీర్ఘ కసరత్తు తర్వాతనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
విశాఖలో 10 వేల కోట్ల రూపాయల ఖర్చుతో రాజధాని ఏర్పాటు చేయవచ్చని, అక్కడ పారిశ్రామికవేత్త లకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అనగానే అదేదో ద్రోహం అన్నట్లు ఓ వర్గం మీడియా ప్రచారం గర్హనీయం అన్నారు. వికేంద్రీకరణ పై ప్రజల్లో అపోహలు సృష్టించడానికి చంద్రబాబు అండ్ కో, ఓ వర్గం మీడియా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాజకీయాల్లో అడ్డదారులు తొక్క కుండా నూతన ఒరవడి సృష్టించినందుకే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం దక్కిందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందరూ సహకారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సభకు అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం, వేలాది కోట్ల రూపాయల లూటీ కోసమే నాడు చంద్ర బాబు అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. బినామీల కోసమే ఇప్పుడు అమరావతి ఉద్యమం చేపట్టారని విమర్శించారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన 100 జిల్లాల్లో రాష్ట్రంలోని అనంతపురం, కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయని తెలిపారు. వికేంద్రీకరణ తోనే ప్రాంతీయ అసమానతలను రూపుమాపవచ్చని పేర్కొన్నారు. అమెరికాలో ఏ పెద్ద నగరం రాజధానిగా లేదని తెలిపారు. హైదరాబాద్ 400 ఏళ్లకు గాని మహా నగరంగా రూపుదిద్దుకోలేదని గుర్తు చేశారు. విశాఖలో అతి తక్కువ ఖర్చుతో రాజధాని ఏర్పాటుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మహా నగరాన్ని నిర్మించాలని భావించడం తెలివి తక్కువతనం అవుతుందని తెలిపారు.
జన చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. విజయ సారథి మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాల్లో వికేంద్రీకరణ అవసరమని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. కన్నా విద్యాసంస్థల అధినేత కన్నా మాస్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య సమాజంలో వికేంద్రీకరణ అత్యంత ఆవశ్యకమని తెలిపారు. వికేంద్రీకరణ తో విద్యావకాశాలు అందరికీ సమానంగా దక్కుతాయని అభిప్రాయపడ్డారు. గ్రామ సచివాలయ ఏర్పాటుతో జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణకు ఎప్పుడో శ్రీకారం చుట్టారని తెలిపారు.
న్యాయవాది పోలూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తొమ్మిది లక్షల కోట్లు ఖర్చు పెడితే కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే అమరావతి కి కేటాయించారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజలను ఉద్యమం పేరుతో పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అమరావతి ఆయన బినామీల రాజధాని మాత్రమే అని తెలిపారు. వికేంద్రీకరణ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు పలికి 13 జిల్లాల్లో అభివృద్ధికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ ఒకే రాజధాని భావన విధ్వంసానికి దారి తీస్తుందని, ప్రస్తుత ఈ పరిస్థితుల్లో వికేంద్రీకరణ ఎంతో అవసరమని తెలిపారు. అభివృద్ధి, రాజధాని వేర్వేరు అంశాలు అనే విషయం ప్రజలు గ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కమిషనర్ జోసఫ్, డాక్టర్ జాన్ బాబు, గ్రామీణ బ్యాంకు సంఘం నేత సుబ్రహ్మణ్య కుమార్ తదితరులు ప్రసంగించారు.













