ఎమ్మెల్యే జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు
రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్ పై తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో వైసీపీని ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కై తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగించిన వారిని, కేసులు ఉన్నవారిని దూరంగా పెడితే వారిని తీసుకువచ్చి పార్టీలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న సీతానగరానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే అతడికి వత్తాసు పలకడం సరికాదన్నారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా కొందరు రైతులతో రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాలు తెరిపించి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.150 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. దీనిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తానని స్పష్టం చేశారు. భరత్ వెనుక రౌడీషీటర్లు, భూకబ్జాదారులు ఉన్నారని ఆరోపించారు. భరత్ చిల్లర పనులు మానుకోవాలని హెచ్చరించారు.













