హైటెక్ సిటీ తరహాలో విశాఖ మిలీనియం టవర్స్
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలో మిలీనియం టవర్స్ నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విజయవాడ శివారులోని గన్నవరంలో మేధా టవర్స్‌లో ఏడు ఐటీ కంపెనీలను లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ పరిశ్రమను మరింత విస్తరిస్తామని అన్నారు. రాష్ట్ర ఐటీ చరిత్రలో ఈ రోజు ఎంతో కీలకమైందన్నారు. రానున్న రెండేళ్లలో ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఆయన తెలిపారు. ఉత్పత్తి రంగంలో 5లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి త్వరలోనే చిప్ డిజైన్ కంపెనీలు కూడా రానున్నాయని తెలిపారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలతో పోటీపడి కియా కార్ల కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇన్నాళ్లూ అవకాశం లేక మన యువత ఇతర ప్రాంతాలకు వెళ్లిందని, ఇప్పుడు రాష్ట్రంలోనే అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.













