హైకోర్టు తీర్పుపై కచ్చితంగా.. సుప్రీం కోర్టుకు వెళ్తాం : హోం మంత్రి సుచరిత
అమరావతి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు కచ్చితంగా వెళ్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మహిళ కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పార్లమెంట్‌ను ఆమె ప్రారంభిచారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పాలనా వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాజధాని ఎక్కడనేది నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకు ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం చాలాసార్లు స్పష్టం చేసిందని తెలిపారు. రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని కోర్టు చెప్పినట్లు తెలిపారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందన్నారు. మొత్తం తరలిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని రాజధానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని హోంమంత్రి పేర్కొన్నారు.













