తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా తెలియని తెలుగు వారెవరుండరని అన్నారు. దళిత సాహిత్యానికి జాషువా ఎంతో సేవ చేశారన్నారు. సమాజంలోని అసమనతలు, రుగ్మతలు తొలగించడానికి రచనలు చేశారని తెలిపారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ కూడా తెలుగు సబ్జెక్ట్‌ను తప్పని సరి చేశామని తెలిపారు. దళిత, బడుగు, బలహీన వర్గాలకు విద్య అందుబాటులో ఉండాలన్నారు.
గత ప్రభుత్వాలు విద్యను ప్రైవేటు పరం చేసి బడుగులకు విద్యను దూరం చేశాయని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు బడుగు, బలహీన విద్యార్థులు కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. మంత్రి వర్గం విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.













