శ్రీవారి భక్తులకు శుభవార్త..ఈ నెల 24 నుంచి
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీ నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 24 నుంచి అదనపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అలాగే మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మార్చి నెలకు సంబంధించి సర్వదర్శన టికెట్లను రోజుకు 20 వేలకు పెంచిన టీటీడీ నిత్యం 5 వేల చొప్పున అదనపు కోటా కింద జారీ చేయనుంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీగోవిందరాజుస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.













