ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వైజాగే బెస్ట్ : జీఎన్ రావు
ఏపీలో సమర్థవంతమైన పాలన అందించేందుకు రాష్ట్రాన్ని నాలుగు జోన్లగా విభజించాలని సిఫార్సు చేశామని విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు తెలిపారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ అత్యుత్తమమని సృష్టం చేశారు. రాజధానిని సముద్రతీరానికి సుమారు 50 కి.మీ. దూరంలో ఉంచాలని, విశాఖ మెట్రో పాలిటన్ రీజియన్ పరిధిలో పరిపాలన భవనాలు ఏర్పాటు చేయాలని తమ నివేదికలో సూచించామని చెప్పారు. విశాఖకు తుపాన్ల ముప్పు ఉంటుందని జీఎన్ రావు కమిటీ నివేదికలో హెచ్చరించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన నిపుణులు తమ కమిటీలో ఉన్నారని, అన్ని అంశాలపై తామంతా చర్చించే నివేదిక రూపొందించామన్నారు. తుపాన్లు అన్ని ప్రాంతాల్లోనూ వస్తాయని సముద్రతీరం కోతకు గురికాకుండా ఎవరూ ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.
మేం సిఫార్సులు మాత్రమే చేస్తాం. ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండాలని చెప్పాం. విశాఖ-చెన్నై కారిడార్ ఏర్పాటుతో ఎంతో అభివృద్ధి చెందుతుంది. విశాఖ మెట్రో పాలిటన్ రీజియన్ ఏర్పాటు చేయాలని దాని పరిధిలో భవనాలు నిర్మించుకోవాలని ప్రభుత్వానికి సూచించాం. అభివృద్ధి వికేంద్రీకరణతోనే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుంది. కొందరు మా నివేదిక ప్రతులు తగులబెట్టడం బాధాకరం. అత్యవసర సమయాల్లోనూ కార్వనిర్వాహక, శాసన వ్యవస్థల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. మంత్రులు ఎక్కడ ఉంటే వారికి కార్యదర్శులు అక్కడే ఉంటారు అని జీఎన్ రావు అన్నారు.













