ఎన్నికల సంఘం చెప్పిన దొంగ ఓట్లు మీవేనా? : గంటా
ఎన్నికల సంఘం చెప్పిన దొంగ ఓట్లు మీవేనా జగన్ అంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మా ఓటర్లు వేరే ఉన్నారు అంటే ఏంటో అనుకున్నాము. ఎన్నికల సంఘం 27 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పింది మీవేనా అంటూ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ ధైర్యంతోనే 175కి 175 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జీరో హౌస్ నెంబర్‌తో 2,51,767 ఓట్లు, ఒకే డోర్ నెంబరుతో 10 ఓట్లకు పైగా ఉన్న ఇళ్లు 1,57,939. ఒకే డర్ నెంబర్‌తో 24,61,676 ఓట్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికారులపై అజమాయిషీ చేస్తూ సాంకేతికంగా ఎక్కడా దొరక్కుండా వాలంటీర్ల సాయంతో అతిపెద్ద మోసానికి తెరలేపారు.
రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి సృష్టించి ప్రజలందరూ ఆ గొడవలో ఉంటే మీరు మాత్రం దొంగ ఓట్లు సృష్టించడంలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గాల వారీగా దొంగ ఓటర్ల లెక్కలు బయటపడాలి. దొంగ ఓటర్లతో పాటు ప్రోత్సహించిన వారికి, సహకరించిన వారికి కూడా శిక్షలు పడాలి. అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. రాష్ట్రంలో వైసీపీకి చెల్లుచీటి పడిపోయింది. ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ మొదలైంది అని అన్నారు.













