గంటా టార్గెట్…
2024 ఎన్నికలే టార్గెట్ గా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అడుగులేస్తున్నారు. తన రాజకీయ వారసుడిని పరిచయం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే రవితేజను ఎక్కడ నుంచి బరిలోకి దించుతారన్న అంశంపై చర్చ నడుస్తోంది. విశాఖ నార్త్ గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం.. అక్కడి నుంచి పోటీ చేస్తారా? లేదా వేరే చోట నుంచి పోటీ చేయించే ప్రయత్నాల్లో ఉన్నారా? ఇంతకూ గంటా స్కెచ్ ఏంటి? నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్రలో లోకేష్ తో గంటారవితేజ కనిపించడం చర్చకు దారి తీసింది.
1999లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు..తర్వాత నాలుగు పర్యాయాలు వేర్వేరు చోట్ల అసెంబ్లీకి పోటీ చేసి వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం 63 ఏళ్ల వయసున్న గంట గంట శ్రీనివాసరావు 2024లో భీమిలి నుంచి పోటీ చేసి ఆ తర్వాత రాజకీయ విరమణ ప్రకటించే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారాయణ అల్లుడు అయిన గంటా రవితేజని తన రాజకీయ వాసుడిగా ముందుకు తీసుకొస్తున్నారా అన్న చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటివరకు రవితేజ ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించలేదు. కానీ వారం రోజులుగా నెల్లూరు జిల్లాలో యువగళంపాదయాత్రలో లోకేష్ తో కలిసి పాల్గొంటున్నారు గంట రవితేజ.
నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రస్తుతం మాజీమంత్రి నారాయణ ఉంటున్నారు. ఓవైపు అనారోగ్యం, మరోవైపు వయసు పైబడడంతో రాజకీయంగా పోటీ చేయాలా? లేదంటే తన వారసులుగా ఎవరి చేతనైనా పోటీ చేయించాలా ఆన్న ఆలోచనలో నారాయణ ఉన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో గంట రవితేజ, కూతురితో కలిసి లోకేష్ యువ గళం పాదయాత్రలో కనిపించడం ఆసక్తికరమైన చర్చికి దారితీస్తోంది. వాస్తవానికి అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల్లో ఎక్కడో ఓచోట కొడుకును పోటీ చేయించాలన్న ఆలోచన గంట శ్రీనివాసరావుకు ఉందన్న చర్చ నడిచింది. తనతో పాటు అవసరమైతే తన వియ్యంకుడైన నారాయణ కోటాలో అయినా రవితేజ కి టికెట్ తెచ్చుకుంటారన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఈసారికి టీడీపీ తరపున నారాయణనే బరిలోకి దించాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఆరోగ్యం, వయసు సహకరిస్తుందా? లేదంటే తన రాజకీయ వారసుడిగా అల్లుడిని నెల్లూరు నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందన్న ఆలోచనలో నారాయణ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కుమార్తె, అల్లుడితో కలిపి నారాయణ కూడా లోకేష్ యువ గళం పాదయాత్రలో కనిపించారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. గంట రవితేజ నిలబడితే సమీకరణలు ఎలా ఉంటాయి? విజయవకాశాలు ఎంత ఎంత మేరకు ఉండొచ్చు? అని వియ్యంకులైన ఈ మాజీ మంత్రులు గంటా, నారాయణాలు ఇరువురు చర్చిస్తున్నట్లు సమాచారం.
అయితే గంటా కుమారుడికి టికెట్ ఇస్తే వారసుల ఆరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి ఇతరనేతలు ఆగుతారా? అది అంత సాధ్యం కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.













