Kakani: అజ్ఞాతంలో కాకాణి..! అరెస్టు భయమే కారణమా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ వార్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయనపై గత కొన్ని నెలలుగా వివిధ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లా (Nellore District) వైసీపీ అధ్యక్షుడిగా, సర్వేపల్లి ఎమ్మెల్యేగా (Sarvepalli MLA) రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించిన కాకాణిపై ఇప్పటివరకు అనేక కేసులు నమోదయ్యాయి.
కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు మీద ఇప్పటివరకు ఏడు కేసులు నమోదైనట్లు 2024 ఎన్నికల సందర్భంగా ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో (election affidavit) పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఆరు తీవ్రమైన నేర స్వభావం కలిగినవి ఉన్నాయి. ఆయన రాజకీయ ప్రత్యర్థులతో ఘర్షణలు, అక్రమ ఆరోపణలు, వివాదాస్పద చర్యల నేపథ్యంలో ఈ కేసులు నమోదయ్యాయి. అందులో ప్రధానమైదని 2017లో నమోదైన నకిలీ పత్రాల కేసు (Forged documents case). టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై (Somireddy Chandra Mohan Reddy) అవినీతి ఆరోపణలు చేస్తూ కాకాణి నకిలీ పత్రాలను సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. 2022లో నెల్లూరు కోర్టు నుంచి ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు చోరీకి గురికావడం సంచలనం కలిగించింది.
గతేడాది కనుపూరు కాలువ అక్రమాలపై కాకాణి గోవర్ధన్ రెడ్డిపైన కేసు నమోదైంది. నవంబర్ 2024లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతిని బయటపెట్టేందుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి రైతులతో కలిసి కనుపూరు కాలువ వద్ద నిరసన చేపట్టారు. పోలీసులు వెళ్లి ఆయనను గృహనిర్బంధంలో ఉంచారు. అనుమతి లేకుండా చేపట్టిన ఈ నిరసనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి లీజు ముగిసిన తర్వాత కూడా రూ. 250 కోట్ల విలువైన క్వార్ట్జ్ (Quartz) ను తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది. ఇది అత్యంత తీవ్రమైనదిగా పరిగణించబడుతోంది. మైనింగ్ అధికారుల (mining department) ఫిర్యాదు మేరకు కాకాణి సహా ఏడుగురిపై FIR నమోదైంది, ఇందులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రస్తుతం క్వార్ట్ అక్రమ తరలింపుపై నమోదైన కేసులోనే కాకాణిని అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు అందుతున్నాయి. అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాకాణి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కానీ పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరయ్యే వరకూ అజ్ఞాతంలో ఉండేందుకు కాకాణి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ నేతలు ఈ కేసులను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నారు. టీడీపీ నాయకులు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నకిలీ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని గతంలోనే కాకాణి చెప్పారు. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై కేసులు, ఆరోపణలు పెరిగాయని చెప్పారు. మరోవైపు టీడీపీ నేతలు కాకాణిపై వచ్చిన ఆరోపణలు నిజమని, విచారణలో అన్ని విషయాలూ బయటకు వస్తాయని ధీమాగా చెప్తున్నారు. కాకాణి అరెస్టు అవుతారన్న వార్త వైసీపీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్టు అయి జైళ్లలో ఉన్నారు. కొంతమంది బెయిల్ పై బయట తిరుగుతున్నారు. ఇప్పుడు కాకాణి కూడా ఆ జాబితాలో చేరే అవకాశం కనిపిస్తోంది.