ఏపీలో పరిస్థితిపై ఈసీ ఫోకస్..
రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగానే వార్నింగిచ్చింది. ఏదైనా ఒక పార్టీకో.. ఎవరైనా ఒక అభ్యర్థికో అనుకూలంగా వ్యవహరిస్తే సహించేది లేదు. అలాంటి వారిపై తీవ్రమైన చర్యలుంటాయి’ అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ హెచ్చరించారు. ‘ఏపీలో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నాం. అర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించడం, అనర్హులకు చోటు లేకుండా చేయటం, జాబితాలో ఉన్న వారందరూ ఓట్లేసేలా చూడటం మా ప్రధాన లక్ష్యాలు’ అని ఆయన స్పష్టంచేశారు. ఏపీలో ఎన్నికల యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, కొంతమంది ఎన్నికల సిబ్బంది, బీఎల్వోలు ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ఫిర్యాదులందాయని రాజీవ్‌కుమార్ చెప్పారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాముల్ని చేయొద్దని కొన్ని పార్టీలు కోరాయన్నారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా చూడాలని కోరటంతో పాటు ఓటర్ల జాబితాపై అనుమానాల్ని వ్యక్తం చేశాయని చెప్పారు.
ఓట్ల తొలగింపు, గంపగుత్తగా చేర్పులపై…
టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ పార్టీల ప్రతినిధులు పలు అంశాలపై ఫిర్యాదులు చేసినట్లు సీఈసీ వెల్లడించారు. ఓట్ల తొలగింపు, గంపగుత్తగా ఓట్లు చేర్చడం, సున్నా డోర్ నంబరుతో భారీగా ఓట్ల నమోదుపై కొన్ని పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై మరింత పర్యవేక్షణ పెంచాలని, ప్రక్రియను పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరాయి. డబ్బు పంపిణీకి అడ్డుకట్ట వేయాలని పలు పార్టీలు కోరాయి. కొంతమంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటర్లుగా నమోదై ఉన్నారని, వారి పేర్లు తొలగించాలని ఓ పార్టీ కోరింది.
రాష్ట్రంలో 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30 మధ్య 21 లక్షల ఓట్లు తొలగించాం. పునః పరిశీలన అనంతరం వాటిలో 13,061 ఓట్లు (0.61 శాతం) అర్హమైనవని తేలటంతో వాటిని పునరుద్ధరించాం. ఒకే డోర్ నంబరుతో 10 అంతకు మించి ఓట్లున్న నివాస గృహాలు 1.57 లక్షలు ఉన్నట్లు గుర్తించాం. వాటిలో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నట్లు తేలింది. గతేడాది అక్టోబరు 27న ముసాయిదా జాబితా విడుదల చేసే నాటికే ఆ నివాసాల సంఖ్యను 65,964కు, వాటిలోని ఓటర్ల సంఖ్యను 9.49 లక్షలకు తగ్గించగలిగాం.సున్నా, అసంబద్ధ సంఖ్యల్ని డోర్ నంబర్లుగా కలిగిన ఇళ్లు 2.52 లక్షలున్నట్లు గుర్తించి ఆ చిరునామాల్ని సరిచేశాం.
ఎవరికైనా సరే రెండు ఓట్లు ఉంటే అది నేరం. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఓటు మార్చుకునేందుకు దరఖాస్తులు చేసుకునే వారు నిర్దేశిత కాలం పాటు ఈ ప్రాంతంలో సాధారణ నివాసితుడిగా ఉంటే ఓటు హక్కు వస్తుంది. ఇప్పటికే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల నామినేషన్ల చివరి తేదీ వరకూ ఓటు నమోదుకు అవకాశముంది.
జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ అధికారులు, ఇతరత్రా సిబ్బంది… ఎవరికీ అనుకూలంగా వ్యవహరించకుండా పర్యవేక్షించాల్సిన, నియంత్రించాల్సిన బాధ్యత ఆయా జిల్లా అధికారులదే. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఎన్నికల యంత్రాంగమంతా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలి. పోలింగ్ ప్రక్రియలో ఎవరైనా జోక్యం చేసుకుంటే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి.
జాబితాలో నుంచి తొలగించిన ప్రతి ఓటునూ పునఃపరిశీలించాం. వాటిపై ఫిర్యాదు చేసిన పార్టీకి ఆ వివరాల్ని పంపించాం. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా ఫిర్యాదులందాయి. వాటిపైనా లిఖితపూర్వకంగా సమాధానమిస్తాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారిపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాల్ని పత్రికల్లో ప్రకటనల ద్వారా వెల్లడించాలి. ఏపీకి అయిదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సరిహద్దులున్నాయి. వాటిలో 139 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. డబ్బు, మద్యం తరలింపునకు సంబంధించి తనిఖీలు చేస్తున్నామన్నారు.













