వివేకం మూవీ పై దస్తగిరి అభ్యంతరం..
ఎలక్షన్ల నేపథ్యంలో రాజకీయ పార్టీలు సినీ ఇండస్ట్రీని కూడా తమ ప్రచారానికి కేంద్ర బిందువుగా మారుస్తున్నాయి. ఇప్పటికే జగన్ కు మద్దతుగా యాత్ర, యాత్ర 2, వ్యూహం లాంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై తీసిన మూవీ వివేకం యూట్యూబ్ లో హంగామా చేస్తుంది. గత ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డి హత్య ప్రచార అస్త్రంగా అన్ని పార్టీలు వాడాయి. రేపు జరగబోయే ఎన్నికల విషయంలో కూడా వివేకా హత్య కేసుని ప్రతిపక్షాలు పెద్ద బ్రహ్మాస్త్రంగా వాడడానికి ఫిక్స్ అయిపోయాయి. ఒకపక్క బాబాయిని చంపింది ఎవరో ప్రజలకు తెలుసు అని జగన్ అంటుంటే.. జగన్ హూ కిల్డ్ బాబాయ్ అని టీడీపీ వర్గాలు గోల చేస్తున్నాయి. ఇంతవరకు హత్య ఎవరు చేశారు అన్న విషయం పై ఎవరికి స్పష్టత లేదు. అయితే యూట్యూబ్లో విడుదల చేసిన వివేకం చిత్రం కథ మాత్రం జగన్, భారతి ,అవినాష్ రెడ్డి ,భాస్కర్ రెడ్డి తదితరులను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతుంది. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ప్రస్తుతం ఈ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. తన స్టేట్మెంట్ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో తన పేరు కూడా ఉండడం పై అతను హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇంకా కేసు సిబిఐ కోర్టులో ఉన్న నేపథ్యంలో.. కేవలం అలా జరిగి ఉండొచ్చు అనే ఆలోచనతో తీసిన ఈ సినిమాని ప్రదర్శించకూడదు అని కోర్టును కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ మూవీని అడ్డుపెట్టుకొని టీడీపీ జగన్ ను టార్గెట్ చేస్తోంది అని ఆయన విమర్శించారు. ఈ విషయంలో కోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి.













