ఈ పాపం సీఎం జగన్ ప్రభుత్వానిదే : పురందేశ్వరి
ఆర్థిక సంఘం నిధులను మళ్లించి పంచాయతీరాజ్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురేందేశ్వరి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన, ధర్మా కార్యక్రమాలను బీజేపీ చేపట్టింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ధర్నాకు పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచ్లు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేస్తున్నారని తెలిపారు. అప్పులు తీర్చలేక సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడం దారుణమన్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామాల్లో పనులు చేపట్టిన చిన్న చన్ని కాంట్రాక్టర్లు సైతం ప్రాణాలు తీసుకుంటున్నారని, ఈ పాపం సీఎం జగన్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలపై మాట్లాడే జగన్ ఏనాడైనా సర్పంచ్ల సమస్యలపై మాట్లాడారా? అని ప్రశ్నించారు. సర్పంచ్ల వ్యవస్థను ఆయన అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.













