ఏప్రిల్ 1న వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏప్రిల్1న కరోనా వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఏప్రిల్ 1న సీఎం జగన్ గుంటూరులో పర్యటించనున్నారు. భారత్ పేట వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత ఆయన కరోనా వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఈ విషయాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ వెల్లడించారు. కోవిడ్ నియంత్రణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆర్థిక భారం ఉన్నా, వ్యాక్సినేషన్లో మాత్రం మొదటి వరుసలోనే ఉన్నామన్నారు. ఏప్రిల్ 1 నుంచి సచివాలయాల్లోకి వ్యాక్సిన్ను అందుబాటులోకి తెస్తున్నామని, అదే రోజు సీఎం జగన్ వ్యాక్సిన్ వేసుకుంటారని ఆయన వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా ప్రభుత్వం ఇచ్చే సూచనలను, సలహాలను ప్రజలందరూ స్వీకరించాలని మోపిదేవి విజ్ఞప్తి చేశారు.













