ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55,548.87 కోట్లుకు ఆమోదం తెలపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.12,911.15 కోట్ల మంజూరుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావస ప్యాకేజీ ఇస్తేనే ప్రాజెక్టు తొలిదశ పూర్తయినట్లువుతుందని ప్రధానికి ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో తొలిదశకు రూ.17,144 కోట్లు మంజూరు చేసేలా జల్‌శక్తి శాఖకు ఆదేశాలివ్వాలని కోరారు. గంట ఇరవై నిమిషాల పాటు ఇరువురూ భేటీ అయ్యారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, ప్రధానితో భేటీ అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను జగన్ కలుసుకున్నారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి, కేంద్రమంత్రులతో సీఎం చర్చించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.













