అందరికీ కరోనా పరీక్షలు అందుబాటులో ఉండాలి : జగన్
రాష్ట్రంలో లాక్డౌన్ విధించకుండానే కరోనాకట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. అందరికీ కొవిడ్ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు ఉన్న అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని సూచించారు. రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో 62 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం కొవిడ్ కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా మరణాలు నమోదవుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆలస్యంగా ఆసుపత్రులను ఆశ్రయించడమే మరణాలకు కారణంగా గుర్తించారు. వాలంటీర్, ఆశా కార్యకర్త, ఏఎన్ఎంలతో ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంటింటి సర్వే చేయడంపై కసరత్తు చేయాలన్నారు. సీసీటీవీల ద్వారా ఆసుపత్రుల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నాణ్యమైన భోజనం, శానిటైజేషన్‌పై దృష్టి సారించాలన్నారు.













