స్మార్ట్ వాటర్‌గ్రిడ్ దిశలో అడుగులు
రాష్ట్రంలో నీటి సమగ్ర వినియోగమే లక్ష్యంగా స్మార్ట్ వాటర్‌గ్రిడ్ దిశలో అడుగులు వేస్తున్నామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలవరం ప్రాజెక్టు కీలకంగా నిలుస్తుందని, ఇది రాష్ట్రానికి జీవనాడిగానేకాక ప్రగతి చిహ్నంగానూ నిలుస్తుందన్నారు. నర్మదా ప్రాజెక్టుకు 1961లో శంకుస్థాపన చేస్తే పూర్తికావడానికి ఇన్నాళ్లు పట్టిందని, ఆలాకాకుండా పోలవరం అనుకున్న సమయానికి పూర్తయ్యేలా పనులను పరుగులు తీయిస్తున్నామన్నారు. ఇందులో అధికార యంత్రాంగంతో సహా అందరూ సహకరిస్తున్నారని, అయితే కొంతమంది మాత్రం కావాలని చిక్కులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా వాటిని అధిగమించి, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. ప్రతి నెల మూడవ సోమవారం ప్రత్యక్షంగా పరిశీలిస్తానన్న హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు 19వసారి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి సోమవారం చేరుకున్నారు. తొలుత ఆయన ప్రాజెక్టు పనులను వ్యూపాయింట్ నుంచి పరిశీలించారు.













