Chandrababu:మనం బాగుంటేనే చాలదు.. తిరిగి సమాజానికి ఇవ్వాలి : చంద్రబాబు
ప్రపంచంలో యువత ఎక్కవగా ఉండేది భారత్లోనే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విజయవాడలో పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్ (Tech AI Conclave )కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీ (IT)ని సద్వినియోగం చేసుకున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ పనైనా సులువుగా చేసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో ఎక్కడ చూసినా రహదారులు గుంతలతో కనిపించేవి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను చక్కగా నిర్మించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ రహదారుల (National Highways) అభివృద్ధి జరుగుతోంది. సంపద సృష్టించాలి. ప్రజలకు అందించాలి. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాం. నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటా. సాంకేతికత ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు (Indians) ఉన్నారు. అందులో తెలుగువాళ్లే అధికం. నా ఆలోచన ఒకటే. మనం బాగుంటేనే చాలదు. తిరిగి సమాజానికి ఇవ్వాలి అని అన్నారు.













