ఆయన నాకు పునర్జన్మ ఇచ్చారు : చంద్రబాబు
తిరుమల శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరమభక్తులన్న విషయం అందరికీ తెలిసింద. స్వామివారిపై తన భక్తిని చంద్రబాబు మరోసారి చాటుకున్నారు. రాజధాని నగరంలో వెంకటేశుడి ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణ పనులు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మనల్ని ఆశీర్వదించడానికి శ్రీవారు అమరావతికి వచ్చారు. ఆయన మా కులదైవం. ఆయన పాదాల దగ్గర పుట్టాను. ఆయన నాకు పునర్జన్మ ఇచ్చారు. 2003లో అలిపిరిలో జరిగిన అతిపెద్ద ప్రమాదంలో బతికి బయటపడతానని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి ప్రమాదంలో నన్ను రక్షించారు. వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఆగమశాస్త్రానుసారం భూకర్షణ జరిపి పనులు ప్రారంభించాం. 25 ఎకరాల్లో దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలనే తలంపుతో ఉచితంగా టీటీడీకి భూమి ఇస్తున్నాం అని అన్నారు.
నేను కానీ, పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కానీ వెంకటేశ్వరుని సేవలో సాంప్రదాయబద్ధంగా, నియమనిబద్ధలతో ఉన్నాం. అమరావతిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం కట్టడం.. దానికి ప్రత్యక్షసాకులు కావడం మనందరి అదృష్టం. ప్రపంచమంతా హిందువులు భక్తిభావంతో కొలిచేదైవం మన రాష్ట్రంలో ఉండటం మనందరి పూర్వజన్మ సుకృతం. అమరావతికి వెంకటేశుడి ఆశీస్సులు కావాలి. కృష్ణనదికి ఈ పక్కన వెంకన్న.. ఆ పక్కన దుర్గమ ఉన్నారు. దీని రక్షణగా ఉన్నారు. వీరిద్దరి ఆశీస్సులతో అభివృద్ధిలో దూసుకుపోతాం. పవిత్ర దివ్వక్షేత్రంగా శాశ్వతంగా ఈ ఆలయం నిలిచిపోవాలని టీటీడీని కోరాను అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు.













