యూటర్న్ నాది కాదు మీదే : చంద్రబాబు
యూటర్న్ తనది కాదని, ఇచ్చిన హామీలు అమలు చేయని మీదే యూటర్న్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఉద్దేశించి విమర్శించారు. అవిశ్వాసం తదనంతర పరిణామాలపై ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 15 ఏళ్ల తర్వాత తామే అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పారు. అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకే అవిశ్వాసం పెట్టామని ఆయన సృష్టం చేశారు. ఏపీకి హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఢిల్లీ తరహా రాజధాని నిర్మిస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ హామీ ఇచ్చారని, ఇంకా ఎన్నో హామీలు ఇచ్చారు కానీ నెరవేర్చలేదని అన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానిని పలుమార్లు కోరామని, 29 సార్లు స్వయంగా ఢిల్లీ వెళ్లానని చెప్పారు. ఏపీ ప్రజలకు కేంద్రం నమ్మకం కల్పించలేకపోయిందని, ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.
కేంద్రం సహకారం కోసం మాత్రమే చూడకుండా నాలుగేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, ఏపీ ప్రజలది కష్టపడే తత్వమని తెలిపారు. కేంద్రం రాజకీయాలకు ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి విభజన బిల్లు పాస్ చేశారని మోదీ అన్నారని, మరి ఇప్పుడు జరుగుతున్నదేంటని ప్రశ్నించారు. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ఆయన నిలదీశారు. ఏపీకి న్యాయం జరుగుతుందనే ఎన్డీఏలో చేరామని, నిన్న సభలో ప్రధాని వ్యాఖ్యలు బాధించాయని కేంద్రం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తన కంటే కేసీఆర్ పరిణతితో వ్యవహరించారని మోదీ అన్నారని, ప్రధాని మోదీ అలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఎప్పుడు మాట్లాడారని ఆయన అడిగారు. అవినీతిని సహించబోమంటూ గాలి అనుచరులకు టికెట్లు ఇచ్చారని, వైసీపీ ట్రాప్లో పడ్డారని మోదీ తనతో అన్నారని, తానెప్పుడూ తప్పుచేయనని మోదీతో చెప్పానని సృష్టం చేశారు. నిన్న జగన్ కోర్టులో ఉంటే తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారని వైసీపీని ఎద్దేవా చేశారు. మరో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండబోదన్నారని, హోదాతో సమానంగా నిధులు ఇస్తామని చెప్పారని కానీ 11 రాష్ట్రాలకు రాయితీలు కొనసాగిస్తున్నారని తెలిపారు. 14వ ఆర్థికసంఘం పేరుతో తప్పుదోద పట్టిస్తున్నారని, రాష్ట్రాలతో సంబంధాలు కొనసాగించే పద్ధతి ఇదేనా అని ప్రశ్శించారు.













