విశాఖ నగరంలో మరో జాతీయ సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ నగరం మరో జాతీయ సదస్సుకు ఆతిథ్యమివ్వనుంది. పౌర సరఫరాలు, వినియోగదారుల హక్కులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 29న దక్షిణాది రాష్ట్రాల అధికారులు నగరంలోని నోవాటెల్ హోటల్లో సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్, డీఎస్వో సూర్యప్రకాష్ పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన అధికారులు హాజరుకానున్నారు.
కన్జ్యుమర్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవికుమార్ సిగ్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో పౌరసరఫరాల విభాగంలో అమలు చేస్తున్న సంస్కరణలు, వినియోగదారుల హక్కులకు సంబంధించిన తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు. ఏడు రాష్ట్రాలకు సంబంధించిన పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, 173 జిల్లాల వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్మన్లు, ఇతర అధికారులు హాజరుకానున్నారు.













