మంత్రులు చేసింది బస్సు యాత్ర కాదు.. తుస్సు యాత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు చేసింది బస్సు యాత్ర కాదు, తుస్సు యాత్ర అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డా.బీఆర్. అంబేడ్కర్ పేరు ఒక చిన్న జిల్లాకు కాదని, దక్షిణ భారత దేశానికి పెట్టాలని అన్నారు. ఏపీలో సామాజిక న్యాయం కాకుండా సామాజిక అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మంత్రి ధర్మాన ఊకదంపుడు ఉపన్యాసాలు కుర్చీలు మాత్రమే విన్నాయి. వైసీపీ ప్రభుత్వానివి నవరత్నాలు కావు, పనికిమాలిన రత్నాలు అన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయాలన్నారు.
87 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రెండు, మూడు నెలల్లో పీసీసీలో మార్పులుంటాయి. అనంతబాబు లాంటి వ్యక్తి చట్టసభల్లో ఉండకూడదన్నారు. ఇప్పుడు జరుగుతున్న దళిత ఉద్యమాలు బలహీనంగా ఉన్నాయి. ఇకపై బలపడతాయి. దేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చేలా లేవు అన్నారు.













