అద్భుత నగరం అమరావతి
రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన పరిపాలన నగరం తుది డిజైన్లను మరో రెండువారాల్లో నార్మాన్ ఫోస్టర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించనుంది. అమరావతి పరిపాలనా నగర రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా, అధికారులు, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు దాదాపు ఏకాభిప్రాయానికి, ఒక అవగాహనకు వచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు రూపొందించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. దీనిపై నార్మాన్ ఫోస్టర్స్ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి పలు మార్పులు, చేర్పులు సూచించారు.
మొత్తం 1350 ఎకరాల్లో అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్, హైకోర్టు, అధికారుల నివాస భవనాలు ఇలాంటి కీలక నిర్మాణాలు ఏవి ఎక్కడుండాలో తెలిపే మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వ ఆమోద ముద్ర పడింది. అంతేకాదు అద్భుతం అనిపించేలా ఐకానిక్ బిల్డింగ్‌లా నిర్మించాలని తలపెట్టిన అసెంబ్లీ డిజైన్ కూడా దాదాపుగా ఖరారైంది. 900 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే పరిపాలనా నగరిలో శాసనసభ, శాసన మండలి, సచివాలయం, రాజ్‌భవన్ తదితర భవనాలు నిర్మాణం కానున్నాయి. దీనికి అనుబంధంగా మరో 450 ఎకరాల్లో హైకోర్టు, ఇతర కార్యాలయాలను నిర్మిస్తారు. వీటి నిర్మాణ పనులు ఎట్టిపరిస్థితుల్లో మరో రెండు నెలల్లో మొదలు కావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సృష్టం చేశారు. మాస్టర్‌ప్లాన్, అసెంబ్లీ ఆకృతులపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఇందులో కొద్దిపాటి మార్పుచేర్పులు చేసి, దాని ఫైనల్ డిజైన్లను ఖరారు చేయనున్నారు. హైకోర్టు డిజైన్లు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయని తెలిసింది. మాస్టర్ ప్లాన్, డిజైన్లకు సంబంధించి ఒక్కొక్క దానికి రెండేసి చొప్పున మోడల్స్‌ను ఈ సమావేశంలో ప్రదర్శించారు. పరిపాలనా నగరపు ఫైనల్ మాస్టర్‌ప్లాన్‌ను మరో 2 వారాల్లో ఫోస్టర్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. హైకోర్టు డిజైన్లను సీఎం సూచించిన మార్పుచేర్పులను చేసి, తుది ఆకృతులను వచ్చే నెలాఖరుకల్లా సమర్పించనున్నారు. పైనల్ డిజైన్లు సిద్ధమైన వెంటనే టెండర్లను పిలిచి, 2 నెలల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు.













