పోలవరానికి పర్యాటక హంగులు
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగానే కాకుండా పర్యాటక రంగానికి ప్రాణనాడిగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న పట్టిసీమ, ధవళేశ్వరం, పాపికొండలు మరికొన్ని చిన్నచిన్న దీవులు పర్యాటకులను ఆకర్షిస్తాయని వీటిని వీక్షించేలా సౌకర్యాలు కల్పించడంతోపాటు అభివృద్ధి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ముందుగా అతిథి గృహాల నిర్మాణం చేపట్టాలని అప్పుడు పర్యాటకులకు ఇబ్బంది ఉండదని సృష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రధాన భాగమైన స్పిల్ వే ఛానల్‌పై నిర్మించి ఐకానిక్ బ్రిడ్జి ప్రతి ఒక్కరినీ ఆకర్షించే విధంగా ఉండాలన్నారు. దీనికి సంబంధించిన ఆకృతులను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా పోలవరం పునాది పనుల నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో జరిగిన నిర్మాణాలు కళ్లకు కట్టేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.













