టీడీపీలో కొత్త వ్యవస్థకు శ్రీకారం : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్మామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారథులను నియమిస్తామని తెలిపారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు జగ్గంపేట పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయామని, ఈసారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్ఛార్జ్లందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేలా వీళ్లు పనిచేస్తారని వివరించారు. సాధికర సారథులుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఈ విభాగం పనిచేస్తుందని తెలిపారు.













