టీడీపీ అధికారంలోకి వచ్చాక.. ఇస్తాం : చంద్రబాబు
రాష్ట్రంలో అన్ని రంగాలను సీఎం జగన్ రివర్స్ గేర్‌లో పెట్టారని, ఆయన మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన రా కదలి రా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో పేదలు సంక్రాంతి పండగను కూడా చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పండగ సమయంలో ఉచితంగా సరుకులిచ్చామని గుర్తు చేశారు. తమ హయాంలో పేదల కోసం అన్న క్యాంటీన్లను తీసుకొచ్చి రూ.5కే పేదల కడుపు నింపామని తెలిపారు.
పేదల బలహీనతను ఆసరా చేసుకుని వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోంది. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. పిల్లలకు దాన్ని అలవాటు చేశారు. గంజాయి నిర్మూలనపై ఒక్క రోజైనా సీఎం సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఛార్జీలు తగ్గిస్తాం. సౌర, పవన విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగులకు రూ.3వేల భృతి చెల్లిస్తాం. జగన్ చెప్పేవన్నీ అసత్యాలే. అధికారంలోకి వచ్చాక పింఛన్ రూ.3 వేల ఇస్తామని జగన్ మాట తప్పారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి నుంచే రూ.3 వేలు ఇచ్చేవాళ్లం. వైసీపీకి ఓటేస్తే మళ్లీ అందరినీ బానిసలుగా మారుస్తారు అని అన్నారు.













