అమరావతి శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించారు. అయితే చంద్రబాబు ఉద్దండరాయునిపాలెంకు వస్తుండడంతో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. సభా ప్రాంగణానికి వెళ్లనివ్వకుండా రూట్ మార్చారు. జనభేరీ సభకు కొద్ది దూరంలో చంద్రబాబు కాన్వాయ్‌ను నిలిపివేశారు. దీంతో ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లేందుకు చంద్రబాబు ఒక్కరికే అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.
దీంతో రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి కాలినడకనే చంద్రబాబు వెళ్లారు. ప్రధాని మోదీ ఆవిష్కరించిన శిలాఫలకాన్ని పరిశీలించారు. యాగశాలలో మోకాళ్లపై ప్రణమిల్లి ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. యాగశాలలో హోం జరిగిన ప్రదేశం వద్దే మోకరిల్లి కొద్దిసేపు మౌనంగా కూర్చుకున్నారు. శంకుస్థాపనలో భాగంగా నవరత్నాలు పెట్టిన ప్రదేశాన్ని తిలకించారు. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.













