కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటి? : చంద్రబాబు
కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటి? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన జయహో బీసీ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశాం రావాలి, అలా రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానని ఆదాయం పెంచే మార్గాలను సూచించానని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నాం. 90 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు అందజేశాం. 125 కులాలకు ఆర్థికసాయం చేసిన పార్టీ టీడీపీ, కార్పొరేషన్ల ద్వారా 3,500 కోట్లు ఖర్చు చేశాం. రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, నాలుగేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా? అని ప్రశ్నించారు.
వందల కోట్ల విలువ చేసే పరికరాలను వైసీపీ ప్రభుత్వం గోదాముల్లో ఉంచేసింది. వాటిని తుప్పు పట్టేలా మార్చారు తప్ప పేదలకు ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వం రాగానే 34 శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను రద్దు చేశారు. బీసీ భవనాలను కూడా పూర్తి చేయలేకపోయారు కానీ మూడు రాజధానులట. రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని దాన్ని పూర్తి చేస్తాం. బీసీలకు ఏం చేశారని వైసీపీ నేతలు సాధికార యాత్ర చేపడుతున్నారు? అని ప్రశ్నించారు.













