తక్షణమే వారిని విడుదల చేయాలి : చంద్రబాబు
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో కొందరు పోలీసులు బెదిరింపుకు దిగడం అత్యంత హేయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కొందరు పోలీసులు బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. సింహాద్రిపురం మండలం నంద్యాలపల్లి గ్రామ పంచాయతీలో సోమశేఖర్ రెడ్డి సహా టీడీపీ కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారన్నారు. సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐ అనిల్ రెడ్డిలు టీడీపీ మద్దతుదారులను తప్పుడు కేసుల్లో ఇరికించి చట్టాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యలకు కొందరు పోలీసులు చట్టాన్ని మీరి బానిసలుగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా దుర్మార్గులకు అండగా నిలుస్తూ దురాగతాలకు పాల్పడే వారిని ప్రజలు సహించరని గుర్తించాలని చంద్రబాబు హెచ్చరించారు.
టీడీపీ శ్రేణులు భావోద్వేగానికి గురికావొద్దని చంద్రబాబు సూచించారు. వైకాపా అరాచక పాలనపై మనోధైర్యంతో ముందుకెళ్దామన్నారు. టీడీపీ కార్యకర్త ఈడిగ నాగేంద్ర ఆత్మహత్య బాధాకరమని అన్నారు. నాగేంద్ర కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.













