ఏపీలో పింఛన్ల పంపిణీ… లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛను పంపిణీ ప్రారంభించారు. మంత్రి లోకేశ్, ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం పూరిగుడిసెలో ఉన్న లబ్దిదారు రాములు ఇంటికి వెళ్లి ముగ్గురు లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు. త్వరలో ఇల్లు నిర్మించి అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు.
అనంతరం లబ్ధిదారు కుటుంబసభ్యులు ఇచ్చిన టీ తాగారు. రాములు కుటుంబసభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొందరు పేదరికంలోనే పుట్టి అందులోనే చనిపోతున్నారని, వారి జీవితాలు మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దానికి ఏం చేయాలనేదానిపై ఆలోచన చేస్తామన్నారు. పిల్లల్ని బాగా చదివిస్తేనే జీవితాలు బాగుపడతాయని చెప్పారు.













