పోలవరంపై సీఎం జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారు : చంద్రబాబు
2014 నుంచి ఎలాంటి ఇబ్బంది లేని పోలవరం విలీన గ్రామాలు ఇప్పుడు మళ్లీ తెలంగాణలో కలపాలని డిమాండ్లు చేయడం వైసీపీ సర్కార్ వైఫల్యం కాదా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పార్టీ ముఖ్యనేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నవ్యాంధ్ర జీవనాడిగా పేర్కొనే పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల నుంచి నిపుణుల కమిటీల వరకు వైసీపీ ప్రభుత్వాన్నే తప్పుబడుతున్నాయని, సీఎం జనగ్ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. పోలవరం గుత్తేదారును మార్చొద్దని పీపీఏ, కేంద్ర జలవనరుల శాఖ రాసిన లేఖను పట్టించుకోలేదని మండిపడ్డారు.
గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నూరు శాతం విఫలమైందన్నారు. ఆదాన్ డిస్టలరీకి రెండేళ్లలో రూ.2,400 కోట్ల విలువైన మద్య సరఫరా ఆర్డర్లు ఇవ్వడంపై ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పరిహారం సీఎం జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయ్? అని ప్రశ్నించారు. పేదలకు ఇచ్చింది జగనన్న కాలనీలు కాదు, జలగన్న కాలనీలు అని అన్నారు. రాష్ట్రంలో బడులు మూస్తున్నారు.. బార్లు తెరుస్తున్నారు. పాఠ్యాపుస్తకాల పంపిణీలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.













