ఈసారి నమ్మారో.. నెక్స్ట్ తాకట్టు పెట్టేది మిమ్మల్నే.. ఏపీ ఓటర్లను హెచ్చరించిన చంద్రబాబు..
జగన్ సర్కార్ ఏపీ సచివాలయాన్ని తాకట్టుపెట్టి 370 కోట్లు అప్పు తీసుకురావడం పై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే మరోసారి ఈ విషయం పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ పరిపాలన వ్యవస్థకు గుండెకాయ లాంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. 2019లో పాలన మొదలుపెట్టిన జగన్ ప్రభుత్వం కారణంగా ఇప్పటికే రాష్ట్రం పరువు, ప్రతిష్ట మంట కలిసిందని..ఇప్పుడు ఏకంగా పరిపాలన భవనమే తాకట్టు పెట్టి ఏపీ బ్రాండ్ ను మరింత హీనస్థితికి తీసుకు వచ్చారని ఆయన మండిపడ్డారు. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏమిటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా అని చంద్రబాబు ప్రశ్నించారు. అంతేకాదు ఇప్పుడు జగన్ తాకట్టు పెట్టింది కేవలం ఒక భవనాన్ని మాత్రమే కాదని.. యావత్ ఆంధ్ర రాష్ట్ర పరువు, ప్రతిష్టను.. ప్రజల ఆత్మగౌరవాన్ని మొత్తం కలిపి తాకట్టు పెట్టారని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకునే వారని ఇప్పుడు ఆ బ్రాండ్ వ్యాల్యూ కాస్త అప్పుల ఖాతాలో కనుమరుగైపోతుందని చంద్రబాబు బాధపడ్డారు. ఇంకొకసారి జగన్ను నమ్మి ఓటు వేస్తే ఈసారి ప్రజలను సైతం అమ్మకానికి పెడతాడని ఈ నేపథ్యంలో చంద్రబాబు హెచ్చరించారు.













