చంద్రబాబు వ్యాఖ్యల వెనక?
రూ..118 కోట్లకు సంబంధించి చంద్రబాబుకు ఐటీ నోటీసులివ్వడం, ఇంతలోనే ఏపీ సీఐడీ కూడా విచారణకు రంగంలోకి దిగడం.. ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు అవినీతి పాపం బద్దలైందని .. రెండు రోజులుగా వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. దీనిపై ఎందుకు మాట్లాడరంటూ లోకేశ్, పవన్ లకు చాలెంజ్ లు సైతం చేస్తున్నారు. ఐటీ నోటీసులకు సంబంధించి ఇంత రచ్చ జరుగుతున్నా.. చంద్రబాబు మాత్రం మౌనంగానే ఉన్నారు. రాయల సీమలో .. చంద్రబాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో యాత్ర కొనసాగిస్తున్నారు.
ఈ వ్యవహారం ఇలా ఉండగానే.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపో, ఎల్లుండో నన్ను అరెస్ట్ చేయవచ్చు. లేదంటే నాపై దాడి చేయొచ్చన్నారు చంద్రబాబు. సైకో పాలనలో అంత విధ్వంసమే కొనసాగుతుందని విమర్శించారు. విమర్శించిన వారిని వేధించడం, కేసులు పెట్టడమే లక్ష్యంగా పాలన నడుస్తోందన్నారు. నిప్పులా, నైతిక విలువలతో రాజకీయాలు చేశానన్నారు చంద్రబాబు. అయితే ఇలాంటి వాటికి భయపడేది లేదని చెబుతున్నారు.
ఇంతకూ చంద్రబాబు నోట అరెస్టు మాట ఎందుకొచ్చింది. నిజంగానే ఆయన అవినీతి బండారం బయటపడడంతో అరెస్టు తప్పదని భావిస్తున్నారా..? అంటే ఇప్పటికే ఎన్నోకేసులు నమోదైనా… వాటిపై స్టేలు తెచ్చి , న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. ఆవరుసలో ఇదొక్కటి అనుకోవచ్చు. మరి ఈమాత్రం దానికే చంద్రబాబు భయపడుతున్నారా? అంటే అనుమానమే అన్న సమాధానం వినవస్తోంది. ఎన్నికల సీజన్ కాబట్టి, దీన్ని ఓఆయుధంగా వాడుకునే అవకాశాలను సైతం కొట్టిపారేయలేం.
ఎన్నికల ఏడాది కావడంతో … అరెస్టు వ్యవహారం, పార్టీకి మైలేజ్ తెచ్చే అవకాశముందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.. ఓ వేళ అరెస్ట్ కనుక చేస్తే, దాన్ని ప్రజల్లోకి ప్రచారాస్త్రంగా సంధించే అవకాశముంది. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉన్న జగన్ తర్వాత సీఎం అయ్యారు. జగన్ పై కక్ష సాధిస్తున్నారన్న అంశం ప్రజల్లోకి వెళ్లడంతో సానుభూతి ఓట్ల రూపంలో వ్యక్తమైంది. అదే తరహా పాలిటిక్స్ కు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మరి ఇలాంటి తరుణంలో చంద్రబాబును అరెస్ట్ చేసి, సెల్ఫ్ గోల్ చేసే ధైర్యం వైసీపీ చేస్తుందా అన్నది కూడా అనుమానమేనని తెలుస్తోంది.













