ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్ మాకు ప్రత్యేకం అని బీజేపీ అగ్రనేతలు చెబుతూ ఉంటారు. అది అక్షరాల నిజం. కానీ ఈ ప్రత్యేకం రాస్ట్రానికి మేలు చేసేలా కాదు. ప్రతి ఫైలునూ అవసరానికి మించి, అసాధారణ స్థాయిలో పరిశీలించడం, రాజకీయ కోణంలో ఆలోచించడం. ఇదే ఆ ప్రత్యేకం. రాష్ట్రాల నుంచి వచ్చే ఫైళ్లను ఢిల్లీలో స్థాయిలో సాధారణ ప్రక్రియాలో భాగంగానే ఆమోదిస్తుంటారు. నిధుల విడుదల నుంచి విధానాల వరకు సాధారణ ప్రక్రియలో భాగంగానే జరుగుతాయి. కానీ రాష్ట్రం నుంచి వెళ్లిన ఫైళ్లపై మాత్రం ఢిల్లీలో ఆసక్తికర చర్చ జరుగుతోందని సమాచారం. ఈ ఫైలును ఏ కోణంలో చూడాలి? ఎంతవరకు సానుకూల నిర్ణయం తీసుకోవాలి? అనే కోణంలో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణంపైనా చర్చ జరుగుతోంది.
ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం సంగతి ఎలా ఉన్నప్పటికీ, కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఢిల్లీలో కూర్చుని ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు. కేంద్రంలో ఏ పథకాల నుంచి నిధులు తెచ్చుకోవచ్చన్న దానిపైనా ఒక మోస్తరు పరిశోధనకు కూడా జరిగింది. ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులే స్వయంగా ఢిల్లీకి వెళ్లి నిధులు సాధించాలని సీఎం ఆదేశిస్తున్నారు. అలా వెళ్లిన సమయంలోనూ కేంద్ర అధికారులు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, బీజేపీ-టీడీపీ మధ్య ఎందుకు చెడింది, ఏపీకి రావాల్సింది ఏంటి, ఇంతవరకూ కేంద్రం చేసిందేమిటి అంటూ వివరాలు ఆరా తీసుకున్నారు. కేంద్రంతో విభేదించిన ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటే అని పేర్కొంటున్నారు. రాజకీయ పరిణామాలు, ప్రభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు.













