అవినాశ్ రెడ్డిని 8 గంటలపాటు విచారించిన సీబీఐ
ఏపీలో కలకలం రేపిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ, వైసీపీ నేత వైయస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించింది. గురువారం నాడు కూడా ఆయన విచారణ కొనసాగింది. ఆయన్ను సీబీఐ అధికారులు మొత్తం ఎనిమిది గంటల పాటు రకరకాల ప్రశ్నలతో విచారించారు. ఈ హత్య కేసులో అవినాశ్ రెడ్డితో పాటు ఉదయ్, వైయస్ భాస్కర రెడ్డిని కూడా సీబీఐ ఇంటరాగేట్ చేసింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన తమపై సీబీఐ కేసులు పెట్టడం కరెక్ట్ కాదని, తన తండ్రి భాస్కర రెడ్డిని అరెస్ట్ చేయడం ఏమాత్రం సబబు కాదని కొన్ని రోజుల క్రితం అవినాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తుది తీర్పును 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ తీర్పు వచ్చే వరకు అవినాశ్‌ను అరెస్ట్ చేయవద్దని సీబీఐకి తేల్చిచెప్పింది. అలాగే ఈ తీర్పు వచ్చే వరకు అవినాశ్ రెడ్డి ప్రతిరోజు విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వరుసగా రెండో రోజు కూడా సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరయ్యారు.













