AP Assembly: ప్రజా సమస్యలపై చర్చ లేకుండా అసెంబ్లీ .. భారీగా తగ్గిన ఎమ్మెల్యేల హాజరు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నెల క్రితమే ప్రారంభమైన ఈ సమావేశాలు ఇంకా కొంతకాలం కొనసాగనున్నాయి. అయితే, ఇవి ఎలాంటి పెద్ద రాజకీయ చర్చలు లేకుండా నిశ్శబ్దంగా సాగిపోతున్నాయి. ఈ సమావేశాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఎక్కువగా హాజరవుతున్నారు. విపక్షంగా ఉన్న వైసీపీ (YCP) సభ్యులు అసెంబ్లీలో కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని వారు డిమాండ్ చేస్తూ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో సభలో అన్ని అంశాలు అధికార పక్షం ఆధ్వర్యంలోనే చర్చించబడుతున్నాయి. సభా కార్యకలాపాలు ఏకపక్షంగా మారిపోవడంతో ప్రజలు, రాజకీయ వర్గాలు కూడా పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
సభకు హాజరయ్యే సభ్యుల సంఖ్య తగ్గిపోవడం మరో చర్చనీయాంశంగా మారింది. విపక్షంలో ఉన్న వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నప్పటికీ వారు అసెంబ్లీకి రారు అనుకోవచ్చు. కానీ, అధికార కూటమికి ఉన్న 164 మంది సభ్యుల్లో చాలామంది కూడా గైర్ హాజరు అవుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రతిరోజూ అసెంబ్లీలో కనీసం 60 మంది కూడా లేరని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) హడావిడి ముగిసినా అసెంబ్లీ సమావేశాల పట్ల ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అసెంబ్లీకి సభ్యులు హాజరుకావాలని పదేపదే కోరుతున్నప్పటికీ పరిస్థితి మారడం లేదు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమర్థమైన వేదిక. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించాలి. అలాగే, ప్రతిపక్ష సభ్యులు హాజరైతే ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సభ్యులు సభకు రావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక, ప్రజలకే అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారు. ఎన్నికైన ప్రతీ ప్రజా ప్రతినిధికి అసెంబ్లీలో హాజరయ్యే బాధ్యత ఉంది. బడ్జెట్ సమావేశాలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతాయి, కనీసం అప్పుడు అయినా సభ్యులు పూర్తిస్థాయిలో హాజరుకావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
గతంలో అసెంబ్లీ సమావేశాలు నెలరోజుల పాటు జరిగేవి. అయితే, కాలక్రమేణా సమావేశాల రోజులను తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ కొన్ని రోజులకు కూడా సభ్యులు హాజరుకావడంలేదు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ చర్చలు అత్యంత కీలకం. రాజకీయ వ్యూహాలను పక్కన పెడితే, సభ్యుల హాజరు కచ్చితంగా ఉండాల్సిందే. సభలో సభ్యుల సంఖ్య తగ్గిపోవడం, ముఖ్యంగా అధికార కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలే గైర్ హాజరు అవ్వడం ఆందోళన కలిగించే అంశం. ప్రజా సమస్యలపై చర్చ జరగాలంటే సభ్యులందరూ హాజరై చర్చించాలి. ఇందుకు గట్టి నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. అసెంబ్లీలో చర్చలు జోరుగా సాగాలి, ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా ప్రస్తావించాలి. రాజకీయ నాయకులు తమ విధులను గుర్తుంచుకుని, ప్రజల కోసం సభకు హాజరై బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు. సభ సమావేశాల్లో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని కఠినమైన నిబంధనలు అమలు చేస్తేనే పరిస్థితి మెరుగుపడుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













