కిలాడి జంట ఘరానా మోసం
-సీఎంలు, మంత్రుల పేర్లు చెప్పి రూ. కోట్లు టోకరా.. విజయవాడలో అరెస్ట్
సీఎంలు, మంత్రుల పేర్లు చెప్పి సంపన్నులను బురిడీ కొట్టించి రూ.కోట్లు దోచుకున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో దిగిన ఫొటోను ఎరగా వేసి రూ.10 కోట్లకు పైగానే కొల్లగొట్టినట్టు తెలుస్తున్నది. 9 కేసుల్లో నిందితులుగా ఉన్న ఈ జంటను ఏపీలోని విజయవాడ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.. ఏపీలోని నందిగామకు చెందిన నర్ర కృష్ణారావు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఇంద్రాణి దంపతులు 20 ఏండ్ల కిందట హైదరాబాద్‌కు వలస వచ్చారు. కృష్ణారావు బడా వ్యాపారిగా, రాజకీయ ప్రముఖుడిగా చెలామణి అవుతుండగా, ఇంద్రాణి న్యాయవాదిగా చెప్పుకొనేది. మెడికల్ సీట్లు ఇప్పిస్తామని, ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పిస్తామని, తమ కంపెనీల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీలు, లాభాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. వీరి మోసాలపై సీసీఎస్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, జీడిమెట్ల ప్రాంతాల్లో 2009 నుంచి 2014 వరకు ఫిర్యాదులు అందినా అరెస్ట్ చేయడంలో కాలయాపన జరిగిందనే ఆరోపణలున్నా యి. విజయవాడలో రూ. 4కోట్లు మోసపోయిన ఓ బాధితురాలి ఫిర్యాదుతో వారిని అరెస్ట్ చేశారు.
కారుకు ఎంపీ స్టిక్కర్.. ఖరీదైన పట్టుచీరలు
కృష్ణారావు ఖరీదైన కార్లకు ఎంపీ స్టికర్ అతికించుకొని, ప్రైవేటు గన్మెన్లతో బడా రాజకీయ నాయకుడిగా బిల్డప్ ఇస్తే, ఇంద్రాణి రూ.25 వేలకు తగ్గని ఖరీదైన పట్టుచీరలు కట్టుకుంటుంది. ముందుగా ఇంద్రాణి సంపన్న కుటుంబాలతో పరిచయం పెంచుకొని, తర్వాత భర్తను పరిచయం చేస్తుంది. సీఎంలు, మంత్రుల పేర్లు చెప్పి వారితో ఫోన్లో మాట్లాడినట్టు నమ్మిస్తారు. మాయమాటలు చెప్పి రూ.కోట్లు దోచేస్తారు. తప్పుడు పత్రాలతో పాస్‌పోర్ట్‌లు, గచ్చిబౌలిలోని టెలికామ్ నగర్ కాలనీ చిరునామాపై 12 సూట్‌కేస్ కంపెనీలను సృష్టించారు. వీరి మోసాలపై నగరంలోని పీఎస్‌లలో కేసులు నమోదైన నేపథ్యంలో వారిని సిటీ పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం.













