వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా కె.అచ్చెన్నాయుడు సచివాలయంలో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం అమలు దస్త్రంపై అచ్చెన్నాయుడు తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి సమ్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. వ్యవసాయశాఖలో ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతి మంగళ, బుధవారం వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు వివరించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. గత ఐదేళ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, వైసీపీ ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదన్నారు.













