వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా..?
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. అధిష్టానం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటానంటూనే వసంత కృష్ణ ప్రసాద్ చేస్తున్న కామెంట్స్ ఆ పార్టీలో రచ్చకు కారణమవుతున్నాయి. వసంత కృష్ణ ప్రసాద్ కు ఉన్నది ఉన్నట్టు చెప్తారనే పేరుంది. ఆయన ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంటారు. తనకు పార్టీలో నచ్చని అంశాలేవైనా ఉంటే వాటిని నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. ఇటీవల ఆయన పార్టీపై పలు కామెంట్స్ చేశారు.
మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును ఓడించి తీరాలనేది వసంత కృష్ణ ప్రసాద్ పంతం. అందుకోసం ఆయన ఎంతో శ్రమించారు. వైసీపీలో చేరి మైలవరం సీటు మాత్రమే కావాలని కోరారు. దేవినేని ఓడించి తీరుతానని శపథం చేశారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో అత్యధికంగా ఖర్చు చేసిన నియోజకవర్గాల్లో మైలవరం ముందుంటుందనే టాక్ అప్పట్లో వచ్చింది. దీన్ని బట్టి ఆయన పంతం ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు. అనుకున్నట్టుగానే మైలవరంలో దేవినేని ఉమపైన వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు.
అయితే ఈ మధ్య మైలవరం నియోజకవర్గంపై మంత్రి జోగి రమేశ్ కన్నేసారనే వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే జోగి రమేశ్ కూడా నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ కంటే మంత్రిగా ఉన్న జోగి రమేశ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. నియోజకవర్గంలో కొంతమంది అధికారుల బదిలీలు కూడా తనకు సమాచారం లేకుండానే జరిగాయని వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. మరోవైపు.. తన కార్యకర్తలపై వేధింపులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయనేది ఆయన చేస్తున్న మరో ఆరోపణ.
తన కక్షపూరిత రాజకీయాలు చేయడం చేతకాదన్న వసంత కృష్ణ ప్రసాద్.. ఒక్కోసారి తాను రాజకీయాల్లో ఎందుకు ఉన్నానా.. అని బాధేస్తోందన్నారు. తాను పుట్టినప్పటి నుంచి తన కుటుంబంలో రాజకీయాల్లోనే ఉంటోందని.. అప్పటికి ఇప్పటికి రాజకీయం చాలా మారిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారం ఉంది కదా అని విపక్ష నేతలపై కేసులు పెడితే.. రేపు వాళ్లు అధికారంలోకి వస్తే తమపైన కేసులు పెడ్తారన్నారు. ఇలాంటి రాజకీయం తన వల్ల కాదన్నారు. ఈ నాలుగేళ్లలో ఎవరిపైనా తాను కేసులు పెట్టలేదని.. అందరినీ కలుపుకు పోయేందుకే ప్రయత్నించానని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు.
వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తిని గమనించిన వైసీపీ అధిష్టానం హుటాహుటిన ఎంపీ అయోధ్య రామిరెడ్డిని రాయబారం పంపింది. అయితే తాను వైసీపీలోనే ఉన్నానని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో మరొకరిని ప్రోత్సహించడం.. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనని ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకోకపోవడం లాంటి అంశాలను వసంత కృష్ణ ప్రసాద్ ఎత్తి చూపినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నానితో వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వర రావు భేటీ కావడం కూడా ఆసక్తి కలిగించింది. ఆ మధ్య ప్రభుత్వ విధానాలను వసంత నాగేశ్వర రావు తప్పుబట్టారు. అది కూడా పెద్ద ఇష్యూ అయింది. ఇటీవల వసంత నాగేశ్వర రావు కూడా ఎన్నారైల విషయంలో ప్రభుత్వ పాలసీ తప్పని స్పష్టం చేశారు. ఇలాంటి అంశాలన్నీ మైలవరం పాలిటిక్స్ ను మలుపు తిప్పుతున్నాయి. త్వరలోనే ఇక్కడ కూడా ఇన్ ఛార్జ్ ను పార్టీ అధిష్టానం నియమించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారడం ఖాయం.













