Police Treatment: రౌడీలకు రోడ్డుపై శిక్ష: న్యాయమా, అన్యాయమా?

గుంటూరు జిల్లా తెనాలి (Tenali) ఐతానగర్‌లో (Ithanagar) రౌడీషీటర్లకు (Rowdysheeters) పోలీసులు ఇచ్చిన బహిరంగ శిక్ష సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సమాజంలో విస్తృత చర్చ జరుగుతోంది. నెల రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. రౌడీషీటర్ లడ్డూ అనుచరులైన చెబ్రోలు జాన్ విక్టర్ (25), షేక్ బాబూలాల్ (21), డోమా రాకేష్ (25) గంజాయి మత్తులో కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై దాడి చేశారు. దీంతో కన్నా చిరంజీవి తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అరెస్టు సమయంలో కానిస్టేబుల్ పై దాడి చేసిన ప్రదేశంలోనే నిందితులను బహిరంగంగా రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై కొట్టారు. తర్వాత కోర్టులో హాజరు పరిచారు.
కొంతమంది పోలీసు చర్యను సమర్థిస్తున్నారు. నేరస్తులకు ఇలాంటి శిక్షలు అవసరమని వాదిస్తున్నారు. రౌడీషీటర్లు సమాజంలో భయాందోళనలు సృష్టిస్తూ, హత్యలు, దోపిడీలు, దాడుల వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్నారని, వారిని దారిలోకి తీసుకురావడానికి ఇలాంటి కఠిన చర్యలు తప్పవని వారి అభిప్రాయం. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఇటీవల రౌడీషీటర్ల ఇళ్లను సందర్శించి వాళ్ల కుటుంబాలతో మాట్లాడి, నేర కార్యకలాపాలు మానుకోవాలని హెచ్చరించారు.
మరోవైపు, ఈ బహిరంగ శిక్షలను కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిందితుల్లో కొందరు దళిత, ముస్లిం సమాజాలకు చెందినవారని, వారిపై ఈ చర్యలు కులం, మతం ఆధారంగా జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్? అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చట్టవిరుద్ధంగా శిక్షలు విధించడం సరికాదని వాదిస్తున్నారు. పైగా ఈ సంఘటనకు కుల, మత రంగు పులుమారు. వాస్తవానికి రౌడీ షీటర్లు దాడి చేసిన కానిస్టేబుల్ బీసీ. ఆయన భార్య ఎస్సీ. ఇక్కడ బాధితులు కూడా అణగారిన వర్గాలకు చెందిన వారే. కానీ వాళ్ల తరపున మాట్లాడకుండా రౌడీ షీటర్లను కులం, మతం పేరుతో వత్తాసు పలకడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
పోలీసులకు శిక్షలు విధించే అధికారం లేదని, న్యాయవ్యవస్థే దీనికి సరైన వేదిక అని విమర్శకులు నొక్కి చెబుతున్నారు. బహిరంగంగా శిక్షించడం చట్టవిరుద్ధమని, ఇది పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు. అలాగే, ఈ ఘటనను కులం, మతం కార్డుతో ముడిపెట్టడం రాజకీయ లబ్ధికోసం జరుగుతోందని మరికొందరు ఆరోపిస్తున్నారు. తప్పు చేసినప్పుడు కులం గుర్తుకు రాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు, రౌడీషీటర్లను కట్టడి చేయడానికి కఠిన చర్యలు అవసరమని, మరోవైపు.. చట్టవిరుద్ధ శిక్షలు, వివక్షపూరిత వైఖరి సరికాదని వాదనలు వినిపిస్తున్నాయి.