టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు బ్రేక్ పడినట్లేనా..?
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. దీంతో ఆ పార్టీకి చెందిన నేతలంతా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. గత ఐదేళ్లలో అనేక ఇబ్బందులు పెట్టిన వైసీపీ నేతలను లాగేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి కూటమి పార్టీలు. ఇందుకోసం తెరవెనుక కూటమి పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా కూడా చేసేశారు. త్వరలోనే కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతలు కామ్ అయిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజూ మీడియా ముందు రెచ్చిపోయిన నేతలంతా ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు. నోరు తెరిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో వాళ్లున్నారు. అదే సమయంలో వైసీపీలో ఇన్నాళ్లూ ఎలాగోలా అడ్జస్ట్ అవుతూ వచ్చిన నేతలు ఇప్పుడు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు. మెజారిటీ నేతలు ఆ పార్టీ నుంచి బయటికొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కూటమి పార్టీలు చెప్తూ వస్తున్నాయి.
వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సమయంలో దాదాపు 8 మంది ఎంపీలు రాజీనామా చేయబోతున్నారని కూటమి పార్టీల నేతలు, ఆ వర్గం మీడియా కథనాలు వండి వార్చింది. అలాగే శాసనమండలిలో కూడా వైసీపీ ఆధిపత్యానికి చెక్ చెప్పేందుకు కూటమి పార్టీలు స్కెచ్ వేశాయని.. త్వరలోనే అది జరగబోతోందని జ్యోతిష్యం చెప్తూ వచ్చాయి. అయితే వాళ్లు చెప్తున్నట్టు పరిస్థితులు కనిపించట్లేదు. రాజీనామా చేసిన ఐదుగురు ప్రజాప్రతినిధులు తప్ప మిగిలిన వాళ్లంతా తాము వైసీపీలోనే ఉంటామని తేల్చేశారు.
ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీళ్లబాటలోనే గొల్ల బాబూరావు, పిల్లి సుభాశ్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి తదితురులు కూడా రాజీనామా చేయబోతున్నారని వార్తలొచ్చాయి. విజయసాయి రెడ్డి కూడా జంప్ అవుతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే వీళ్లంతా తాము వైసీపీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. ఆ పార్టీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పేశారు. దీంతో కూటమి పార్టీల ఆపరేషన్ ఆకర్ష్ పెద్దగా ఫలించలేదని అర్థమవుతోంది.













